Sri Gnana Saraswathi Devasthanam

శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం

బాసరా, నిర్మల్ జిల్లా

About Us


శ్రీరస్తు

శుభమస్తు

అవిఘ్నమస్తు

దేవాదాయ - ధర్మాదాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వము

శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం

బాసర (గ్రా . & మం.) నిర్మల్ జిల్లా - 504101

సరస్వతి శృతి మహాతి మహియతాం

శ్రీ గణేశా శారదా గురుభ్యోనమం

పురాణగాథ:

భారతావనిలో అతి ప్రసిద్ది గాంచిన శ్రీ జ్ఞాన సరస్వతీ క్షేత్రము బాసర, భారతదేశములో గల సరస్వతీ దేవాలయాలన్నింటిలోనూ, కాశ్మీరులోని సరస్వతీ దేవాలయము మరియు బాసర లోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయము మిక్కిలి సుప్రసిద్ధమైనది. తెలంగాణా రాష్ట్రము నందలి నిర్మల్ జిల్లాలోని బాసర మండలములో గల బాసర గ్రామము పొరుగున ఉన్న మహారాష్ట్ర సరిహద్దులో గలదు. ఇచ్చట పవిత్ర గోదావరి నదీతీరమునకు ఒక కిలోమీటరు దూరమున మహా మహిమాన్వితమగు శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయము కలదు. ఇచ్చట గల దేవీ స్వరూపము సాక్షాత్ శ్రీమన్నారాయణాంశ సంభూతుడు శ్రీ వేదవ్యాస మహర్షికి కురుక్షేత్ర యుద్ధానంతరము మనఃశాంతి కోరి తన కుమారుడైన శుకునితో, సకల బృంద సమేతుడై సమస్త తీర్థాటనము గావించుచు దక్షిణ భారతమునందు గౌతమీ (గోదావరి) నదీ తీరాన కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంబించాడు. ఇక్కడ దండకారణ్యంలో సంచరించుచుండగా జగన్మాత ఆదేశము మేరకు అవ్యక్త స్వరూపిణియై శ్రీ సరస్వతీ దేవి యున్నట్లు గ్రహించి దేవిని స్తుతించగా ఆ దేవి ప్రసన్నురాలై... " నీపు నా యొక్క విగ్రహమును ఇచ్చట ప్రతిష్టించి పూజింపుము." అని ఆజ్ఞాపించెను. అటు పిమ్మట శ్రీ వేద వ్యాస మహర్షి ప్రతిదినము గౌతమీ నదీస్నానమాచరించి సరస్వతీ దేవిని ధ్యానించి మూడు ముష్టుల సైకతము(ఇసుక) ను తీసుకుని వచ్చి ఇదే క్రౌమారచల ప్రాంతమున మూడు స్థలముల యందుంచుచూ వచ్చెను. క్రమేణ మూడు మూర్తులుగా ఉద్భవించి శ్రీ మహా సరస్వతీ, శ్రీ మహా లక్ష్మీ, శ్రీ మహా కాళీ రూపములలో వెలసియుండెను. ముగ్గురు అమ్మవార్లను, శ్రీ వేదవ్యాస మహర్షి సర్వాంగసుందరంగా ప్రతిష్టించెను. శ్రీ వేద వ్యాసుని చేత ఈ దేవి ప్రతిష్టించబడి నందున మరియు వ్యాసుడు ఈ క్షేత్రమున నివసించుచుయున్నందున ఈ క్షేత్రము “వాసర” గా వ్యవహరింప బడుచున్నది.


ఈ దేవాలయమునకు సమీపముననే పర్వత గుహ యందు కుమారస్వామి తపస్సు చేసినందువలన ఈ పర్వతమునకు కుమారచల పర్వతమని పేరు వచ్చినది. ఇచ్చట ప్రధాన దేవాలయమునకు తూర్పు భాగమున ఔదుంబర వృక్ష ఛాయ లో దత్తమందిరమున సుందరమగు శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహము, దత్తపాదుకలు కలవు.

శ్రీ మహాకాళీ దేవాలయము పశ్చిమ భాగమున కలదు. ఆగ్నేయమున అత్యంత మహిమాన్వితమైన అష్టతీర్థ పుష్కరిణి కలదు.

శ్రీ వ్యాస మందిరము దక్షిణ దిశలో కలదు.

బాసర గ్రామమునకు వెళ్ళు దారిలో బస్టాండు ఆవరణలో వేదవతి (దనపు గుండు) అను పెద్ద శిల కలదు. అట్టి శిలను మరియొక చిన్న శిలతో కొట్టిన యెడల విచిత్ర ధ్వని వచ్చును. గోదావరి సమీపమున శివాలయము(సూర్యేశ్వరాలయము) కలదు.



ఆలయ విశేషాలు:

దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి బాసర లోని సరస్వతీ దేవాలయము. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు ఆక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవార్ల కోలువైనందున ఈ ఆలయము త్రిశక్తి పీఠముగా విరాజిల్లుచున్నది. వేదవ్యాసుని స్వయం ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. ఆలయ ప్రాంగణంలోని జ్ఞాన నూనె దీపముతో ప్రసూనాంబ చేతిలో ఉన్న ఆఖండ జ్యోతికి నిరంతర వెలుగుకోరి సమర్పించినట్లయితే జీవితం కూడా అఖండ జ్యోతిగా ఎల్లపుడు వెలుగుతుందని నానుడి సుప్రసిద్ధి బాసర సరస్వతి క్షేత్రముతో నిత్యము శ్రీ అమ్మవార్లకు నిత్య అభిషేకము ప్రత్యేక ఆర్జిత సేవ శక్తి సంప్రదాయముగల దేవాలయముతో ఎక్కడ లేని విధముగా శ్రీ అమ్మవార్లకు నిత్య అభిషేకము, మూల విగ్రహములకు నిత్య అలంకరణ ఇక్కడ ప్రత్యేకతతో అలంకరించిన పసుపును (బండారం) నిత్యము శ్రీ అమ్మవారి మహా ప్రసాదముగా భక్తులకు ఇవ్వడము జరుగుతుంది దీనిని సేవించినట్లయితే శ్రీ అమ్మవారి అనుగ్రహముతో పాటు మంచి విద్య మరియు వాక్కు (మాటలు రాని వారికి) మాటలు శ్రీ అమ్మవారు ప్రసాదిస్తుంది మరియు ప్రతి మంగళవారం శ్రీ అమ్మవార్లకు మధు (తేనే) తో అభిషేకము చేయడము జరుగుచున్నది. ఇట్టి తేనెను కూడా శ్రీ అమ్మవారి ప్రసాదముగా భక్తులకు పంచడము జరుగుచున్నది. సనాతన సంప్రదాయము ప్రకారము ఇక్కడ ఎటువంటి బీజ అక్షరములు తేనే తో వ్రాయడము గాని ఇక్కడ ఆలయ సంప్రదాయములో లేదు. కావున భక్తులు ఎటువంటి సామజిక మాధ్యమాలలో వచ్చే వదంతులను నమ్మవద్దు.


ముఖ్య పండుగలు.

1.శ్రీ వ్యాస పూర్ణిమ ( ఆశాఢ శుద్ధ పౌర్ణమి)

2.దసరా నవరాత్రోత్సవములు ( ఆశ్వీయుజ మాసము)

3.శ్రీ వసంత పంచమి ( శ్రీ సరస్వతీ దేవి జన్మదినోత్సవము) (మాఘ శుద్ధ పంచమి)

4.మహా శివరాత్రి ఉత్సవములు. (మాఘ బహుళ చతుర్దశి)

5.దత్త జయంతి ( మార్గశిర శుద్ధ పంచమి )

దసరా నవరాత్రోత్సవములు:ఆశ్వీయుజ శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు జరుగుతాయి ఉదయము, సాయంకాలము 64 ఉపచారములతో వైదిక విధానంలో అమ్మవారికి వైభవముగా పూజలు జరుగుతాయి. శ్రీదేవి భాగవతము, దుర్గా సప్తశతి పారాయణాలు జరుగుతాయి. మహర్నవమి రోజున చండీహోమము చేయబడుతుంది, విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకము, సుందరమైన అలంకారము, సాయంకాలము రధోత్సవము, శమీపూజ జరుగుతాయి ఈ ఉత్సవాలలో భక్తులు ఉపాసకులు తమ తమ అభీష్టానుసారం పూజలు చేసుకుంటారు. ఇంకా ధార్మిక చర్చలు, ఉపన్యాసములు, హరికథలు, పురాణ పఠనం నిర్వహిస్తారు. యాత్రికులకు నిరతాన్నదానం సమర్పిస్తారు సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహిస్తారు.

శ్రీ వసంత పంచమి: _మాఘ శుద్ధ పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. మహాభిషేకం తరువాత వివిధ పుష్పాలతో వాగ్దేవిని నయనానందకరంగా అలంకరిస్తారు. జగద్రక్షణకై, భక్త పోషణకై అవతరించిన కామితార్థ ప్రదాయినిగా బాసర జ్ఞాన సరస్వతి ఈనాడు విశేష పూజలందుకొంటుంది. వసంత పంచమికి 15 రోజుల ముందు నుండి ప్రారంభం అయ్యే ఈ ఉత్సవాలు వసంత పంచమికి మూడు రోజుల వరకు జరుగుతాయి. ఆ సమయంలో దేవికి ప్రత్యేక పూజలు ఆరాధనలు జరుపుతారు.

మహా శివరాత్రి:- మహా శివరాత్రి పర్వదినం మొదలుకొని మూడు రోజులు పెద్ద జాతర సాగుతుంది. వేలాది భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి వాగ్దేవికి ప్రదక్షిణాలు ఆచరిస్తారు.

మాధుకరము (అనుష్ఠానము బిక్ష) :- ఈ క్షేత్రములో ఇది ఒక ముఖ్యమైన సంప్రదాయం. మధుకర వృత్తి (యాచించుట) ద్వారా లభించే భిక్షకు మాధుకరము అని పేరు. శ్రీదేవి అనుగ్రహము కోరేవారు నియమ నిష్టలతో 3,5,7,9,11,21 లేదా 41 రోజులు దీక్షతో గురుప్రదేశ మంత్రము అనుష్ఠానం చేస్తారు ఆ కాలములో వారు మధ్యాహ్నం గ్రామములోకి పోయి భిక్షను స్వీకరించి సరస్వతి దేవికి నమస్కరించి ఆ భిక్షను భుజిస్తారు. దీక్షగా ఉంటారు ఆలా చేస్తే తప్పక అమ్మవారు అనుగ్రహిస్తుంది అని భక్తుల విశ్వసం.

రవాణా సౌకర్యములు:- నిజామాబాదు, భైంస, బోధన్, హైద్రాబాదు, జనగాం, యాదగిరి గుట్ట, నుండి బస్సు సౌకర్యము. మరియు నాందేడ్, ముఖేడ్, హైదరాబాదు, విజయవాడ నుండి రైలు సౌకర్యము కలదు.

వసతి : దేవస్థానములో AC అతిధి గృహములు, Non - AC మరియు డార్మెంటరీ హాల్స్ భవనము కలవు.

TOP